విఘ్నేశ్వర దండకము
శ్రీపార్వతీపుత్ర లోకత్రయస్తోత్ర సత్పుణ్యచారిత్ర భద్రేభవక్తా మహాకాయ కాత్యాయనీనాథ సంజాత స్వామీ శివా సిద్ధివిఘ్నేశ నీ పాదపద్మంబులన్ నీదు కంఠంబు నీ బొజ్జ నీ మోము నీ మౌళి బాలేందుఖండంబు నీ నాల్గుహస్తంబులున్ నీ కరాళంబు నీ పెద్ద వక్త్రంబు దంతంబు నీ పాదహస్తంబు లంబోదరంబున్ సదా మూషకాశ్వంబు నీ మందహాసంబు నీ చిన్నతొండంబు నీ గుజ్జురూపంబు నీ శూర్పకర్ణంబు నీ నాగయజ్ఞోపవీతంబు నీ భవ్యరూపంబు దర్శించి హర్షించి సంప్రీతి మొక్కంగ శ్రీగంధము న్ కుంకుమంబక్షతల్ జాజులన్ చంపకంబుల్ తగన్ మల్లెలున్ మొల్లలున్ మంచి చేమంతులున్ తెల్లగన్నేరులున్ మంకెనల్ పొన్నలన్ పువ్వులున్ మంచి దూర్వంబులన్ దెచ్చి శాస్త్రోక్తరీతిన్ సమర్పించి పూజించి సాష్టాంగముంజేసి విఘ్నేశ్వరా నీకు టెంకాయ పొన్నంటి పండ్లున్ మరిన్మించివౌ నిక్షుఖండంబులున్ రేగు పండ్లప్పడంబుల్ వడల్ నేయిబూరెల్ మరిన్ గోధుమప్పంబులున్ పునుగులున్ బూరెలున్ గారెలున్ చొక్కమౌ చల్మిడిన్ బెల్లమున్ తేనెయున్ జున్ను బాలాజ్యమున్ నానుబియ్యంబు నామంబు బిల్వంబు మేల్ బంగరు బళ్ళెమందుంచి నైవేద్యమున్ బంచ నీరాజనంబున్ నమస్కారముల్ జేసి విఘ్నేశ్వరా నిన్ను పూజింపకే యన్యదైవంబులన్ ప్రార్థనల్ సేయుటల్ కాంచనంబొల్లకే యిన్ముదా గోరుచందంబు గాదే మహాదేవ యో భక్తమందార యో సుందరాకార యో భాగ్యగంభీర యో దేవచూడామణీ లోకరక్షామణీ బంధుచింతామణి స్వామి నిన్నెంచ నేనెంత, నీ దాసదాసానుదాసుండ శ్రీదొంతరాజాన్వయుండ రామాభిధానుండ నన్నిపుడు చేపట్టి సుశ్రేయునిన్ జేసి శ్రీమంతుగా జూచి హృత్పద్మ సింహాసనారూఢతన్నిల్పి కాపాడుటే గాదు నిగ్గొల్చి ప్రార్థించు భక్తాళికిన్ కొంగుబంగారమై కంటికిన్ రెప్పపై బుద్ధియున్ విద్యయున్ పాడియున్ పుత్రపౌత్రాభివృద్ధిన్ దగన్ గల్గగా చేసి పోషించుమంటిన్ గృపన్ గావుమంటిన్ మహాత్మా యివే వందనంబుల్ గణేశా నమస్తే నమస్తే నమస్తే నమః ||